టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీలో కొత్త కోణం

-

టీఎస్‌పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. నిన్నటిదాకా టీఎస్‌పీఎస్సీ కార్యాలయం నుంచే ప్రశ్నపత్రాలు లీకైన విషయం బయటకు రాగా తాజాగా పరీక్ష కేంద్రం నుంచి వాట్సాప్ ద్వారా బయటకు వచ్చినట్టు సిట్ దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌కు తెరలేపిన విద్యుత్తుశాఖ డీఈఈ పూల రమేశ్‌ లీలలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి.

అతడి ముఠా ఏఈఈ, డీఏవో పరీక్షలకు హాజరైన 11 మంది అభ్యర్థులకు స్పీకర్‌ను అమర్చినట్లు పోలీసులు గుర్తించారు. పరీక్ష అనంతరం చెవిలో నుంచి దాన్ని బయటికి తీసేందుకు ఇయర్‌బడ్‌ రూపంలో ఉన్న మాగ్నెటిక్‌ పరికరాన్ని వినియోగించారు. అలాగే చిన్నపాటి చిప్‌తో కూడిన డివైజ్‌ను బనియన్‌లో కుట్టిన ప్రత్యేక అరలో బిగించిన ముఠా.. అదే బనియన్‌లో భుజం వద్ద మైక్రోఫోన్‌ను అమర్చింది.

పరీక్షలో హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌ ఎలా చేయాలో వీరికి తర్ఫీదు ఇచ్చేందుకు మలక్‌పేట టీవీ టవర్‌ ప్రాంతంలో ఖాలేద్‌ అనే వ్యక్తి ఇంట్లో ప్రత్యేకంగా ఓ కంట్రోల్‌రూంను ఏర్పాటు చేసింది. సమాధానాలు చేరవేసేందుకు ప్రతి అభ్యర్థికి ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచింది. అరగంట ముందే కేంద్రంలోకి వెళ్లి తాము ఏ బెంచీలో కూర్చున్నామనే విషయాన్ని మైక్రోఫోన్‌ ద్వారా కంట్రోల్‌రూంలోని తమ సహాయకుడికి చేరవేసేలా ప్రణాళిక రచించింది. ఈ వ్యవహారంలో మరో 20 మంది వరకు ప్రమేయముందని గుర్తించిన సిట్‌ వారిని పట్టుకునే పనిలో నిమగ్నమైంది.

Read more RELATED
Recommended to you

Latest news