ఈనెల 15న తెలంగాణలో ఘనంగా వైద్య ఉత్సవాలు

-

ఈనెల 15వ తేదీన రాష్ట్రంలో వైద్య ఉత్సవాలను నిర్వహించనున్నారు. జనగామ, నిర్మల్‌, కామారెడ్డి, కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, ఆసిఫాబాద్‌, భూపాలపల్లి, వికారాబాద్‌, ఖమ్మం జిల్లాల్లో ఈనెల 15న కొత్తగా ప్రభుత్వ వైద్య కళాశాలలు ప్రారంభించనున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల్లో ఘనంగా వైద్య ఉత్సవాలను నిర్వహించాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ పార్టీ శ్రేణులను ఆదేశించారు. కనీసం 15 వేల నుంచి 20 వేల మందికి తగ్గకుండా భారీ ప్రదర్శనలను చేపట్టాలని సూచించారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా జిల్లాకొక ప్రభుత్వ వైద్యకళాశాలను ఏర్పాటు చేస్తున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుందని మంత్రి కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఈనెల 15న తొమ్మిది కాలేజీలను ఏకకాలంలో ప్రారంభించి చరిత్ర సృష్టించనుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 157 వైద్యకళాశాలలు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది శూన్యమని మండిపడ్డారు. తెలంగాణ ఆహారోత్పత్తిలోనే కాదు.. ఆరోగ్యానికి కీలకమైన వైద్యులను తయారుచేయడంలోనూ అగ్రస్థానంలో ఉందని చెప్పారు. స్వయంగా ముఖ్యమంత్రి ఒక వైద్యకళాశాల ప్రారంభోత్సవంలో పాల్గొనే అవకాశముందని.. మంత్రి హరీశ్‌రావు కామారెడ్డిలో పాల్గొంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news