తెలంగాణలో పెరుగుతున్న తట్టు కేసులు.. ఆర్నెల్లలో 921 మందికి పాజిటివ్‌

-

తెలంగాణలో తట్టు (మీజిల్స్‌) కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ప్రధానంగా 15 ఏళ్లలోపు పిల్లలు గత కొన్ని నెలలుగా ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. దాదాపు గడచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో వెయ్యి కేసుల వరకు నమోదైనట్లు రాష్ట్ర వైద్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో సుమారు 1,500 మీజిల్స్‌ అనుమానిత కేసులపై ప్రత్యేక వైద్య పరీక్షలు చేయగా 921 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పేర్కొంది. అత్యధిక కేసులు హైదరాబాద్‌లో నమోదైనట్లు వెల్లడించింది. తర్వాత స్థానం రంగారెడ్డిది కాగా, మూడో స్థానంలో మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఉంది.

వ్యాధి సోకిన చిన్నారుల్లో తొమ్మిది నెలల్లోపు పిల్లలు 131 మంది ఉండగా.. మొత్తం 237 మంది పిల్లలు వ్యాక్సినేషన్‌కు దూరంగా ఉండి మీజిల్స్‌ వ్యాధికి గురయ్యారు. మరో 128 మంది ఒక డోస్‌ మాత్రమే వేయించుకున్న వారు ఉన్నారు. 2022, నవంబరు నుంచి 2023 ఏప్రిల్‌ వరకు 1,092 కేసులు నమోదవ్వగా.. అప్పట్లో ఇద్దరు మృతి చెందారు. వ్యాక్సిన్‌లు వేయించకపోవడం పిల్లల పాలిట శాపంగా మారుతోందని అధికారులు అంటున్నారు. మీజిల్స్‌-మంప్స్‌-రుబెల్లా (ఎంఏఆర్‌) వ్యాక్సిన్‌ను పిల్లలకు వేయించడం ద్వారా తట్టు, చికెన్‌పాక్స్‌ వంటివి కూడా రావని అధికారులు చెబుతున్నారు. పిల్లలకు 12 నుంచి 15 నెలల్లోపు ఒక డోసు, నాలుగేళ్ల నుంచి ఆరేళ్లలోపు మరో డోసు వ్యాక్సిన్‌ వేయించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news