అటవీ అమరవీరుల త్యాగాలు మరవొద్దని వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సిబ్బందికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కోరారు. జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్‌లోని నెహ్రూ జూపార్క్ స్మారక చిహ్నం వద్ద మంత్రి, అధికారులు, సిబ్బంది పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. అటవీ సంపదను దోచుకునే స్మగ్లర్లు, అరాచకముఠాలకు ఎదురొడ్డి ప్రాణాలు అర్పించి వీరమరణం పొందిన సిబ్బంది త్యాగాలు వృధా కానివ్వకుండా, వారి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని సూచించారు.
విధి నిర్వహణలో అసువులు బాసిన కుటుంబాలకు రాష్ట్రప్రభుత్వం అండగా ఉంటుందని… అటవీ సంపద పరిరక్షణలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. హరితహారం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 290 కోట్లకు పైగా మొక్కలు నాటామన్న ఇంద్రకరణ్‌రెడ్డి అధికారులు, సిబ్బంది కృషితో అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నట్లు వివరించారు. ఆదివాసీ, గిరిజనబిడ్డలకు భూమిహక్కు కల్పిస్తూ పోడుపట్టాల పంపిణీకి సీఎం శ్రీకారంచుట్టారని రాష్ట్రవ్యాప్తంగా లక్షా యాబై వేల గిరిజన కుటుంబాలకు 4.06 లక్షల ఎకరాలకు పట్టాలు అందించినట్లు తెలిపారు.
పోడు భూముల సమస్య పరిష్కారంతో గిరిపుత్రులు, అటవీ సిబ్బందికి మధ్య ఘర్షణను నివారించగలిగినట్లు ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. భవిష్యత్‌లో అటవీ భూములు అన్యాక్రాంతం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.