తెలంగాణ విద్యుత్ రంగం ఆర్థిక పరిస్థితిపై శాసనసభలో వాడివేడిగా చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ రంగంపై శ్వేత పత్రం విడుదల చేయగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి దానిపై మాట్లాడారు. ఈ క్రమంలో జోక్యం చేసుకున్న ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. యాదాద్రి ప్రాజెక్టులో పెద్ద కుంభకోణం జరిగిందని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. రూ.10 వేల కోట్లు జగదీశ్‌రెడ్డి తిన్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. టెండర్ పెట్టకుండా ఇవ్వడమే పెద్ద కుంభకోణమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
“24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లు చెప్పడం అబద్ధం. సబ్ స్టేషన్లలో లాగ్ బుక్కులు చూస్తే తెలుస్తుంది. నేను వెళ్లిన తర్వాత లాగ్ బుక్కులు లేకుండా చేశారు. రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగింది కాబట్టే నష్టాలు వస్తున్నాయి. గత ప్రభుత్వం పదవి విరమణ చేసిన వాళ్లను పెట్టి దోచేశారు.” అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.