రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు 18 ఏళ్ల యువతని కిడ్నాప్ చేసిన ఘటన సంచలనం రేపింది. చందుర్తి మండలం మూడేపల్లి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన సీసీటీవీలో రికార్డు అయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యువతి, ఆమె తండ్రి ఆ గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో పూజల కోసం వెళ్లారు. పూజలు ముగించుకొని గుడి బయటకి రాగానే కారులో వేచి ఉన్న దుండగులు యువతని కిడ్నాప్ చేశారు.
యువతి తండ్రిని పక్కకు నెట్టి బాధితురాలుని కారులో ఎక్కించుకొని వేగంగా పారిపోయారు దుండగులు. ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ సీరియస్ అయ్యారు. యువతి కిడ్నాప్ ఘటనపై మంత్రి కేటీఆర్ ఆరా తీశారు. జిల్లా ఎస్పీ ని అడిగి వివరాలు తెలుసుకున్నారు మంత్రి కేటీఆర్. మంగళవారం వేములవాడ పర్యటనలో ఉన్న కేటీఆర్.. జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేను పిలిపించుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. యువతి కిడ్నాప్ నిందితులను సాయంత్రం లోపు పట్టుకోవాలని ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు దురదృష్టకరమన్నారు మంత్రి.