తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే అధికార కాంగ్రెస్ ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ప్రతీ పక్ష బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల అదే అభ్యర్థులను పెడుతూ.. మరి కొన్ని చోట్ల అభ్యర్థులను మార్పులు చేస్తుంది. అధికార కాంగ్రెస్ చాలా చోట్ల కొత్తగా పార్టీలోకి జాయిన్ అయిన వారికి టికెట్లు ఇస్తున్నారు. ఇదిలా ఉంటే.. అధికార కాంగ్రెస్.. ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం జోరుగా కొనసాగుతుంది.
తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలోని రైతులను కేసీఆర్ రెచ్చగొడుతున్నారని.. కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే తాగు, సాగు నీటి కొరత అంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని ధ్వజమెత్తారు. అధికారంలో ఉండి లక్షల కోట్లు ప్రజాధనం దోచుకున్నారని ఆరోపించారు. రైతు సంక్షేమమే తమ ప్రభుత్వం ధ్యేయమని స్పష్టం చేశారు. తెలంగాణలో తాగు, సాగు నీటి కొరత లేకుండా చేస్తామని పేర్కొన్నారు.