రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి పై సంచలన ఆరోపణలు చేశారు బిజెపి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రోడ్లు, భవనాల శాఖలో వేలకోట్ల అవినీతి జరిగిందని.. మంత్రి ప్రశాంత్ రెడ్డి నిధులను నొక్కేశారని ఆరోపించారు. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే 318 కోట్ల రూపాయల స్కాం జరిగిందని.. ఆ సొమ్మునంతా ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్సీ కవితకు కమిషన్ ద్వారా పంపిస్తున్నారని ఆరోపించారు. బాల్కొండలో కట్టే ప్రతి బ్రిడ్జిపై ఎమ్మెల్సీ కవితకు కమిషన్ వెళుతుందని ఆరోపించారు.
అయితే ఎంపీ అరవింద్ చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించారు ప్రశాంత్ రెడ్డి. డబుల్ బిల్లులు తీసుకున్నామన్న ఆరోపణలు అవాస్తవమని అన్నారు. సెంట్రల్ ఫైనాన్స్ అసిస్టెన్స్ కింద ఇచ్చిన 300 కోట్లతో 70 కోట్లు కేటాయించామన్నారు. అరవింద్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. కష్టపడుతున్న తమపై దుష్ప్రచారం చేయడం తగదన్నారు. అసలు డబల్ బిల్లులకు ఆస్కారమే లేదన్నారు. ఆరోపణలపై సిబిఐతో విచారణ చేసుకోవచ్చని స్పష్టం చేశారు ప్రశాంత్ రెడ్డి.