షుగర్ వచ్చిన వాళ్లు స్వీట్స్ తినకూడదు. తీపిగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. కానీ చాలామంది నాచురల్ స్వీట్‌ను వదిలేసి ఆర్టిఫీషియల్ స్వీట్‌గా అలవాటు పడతారు. ఇది తియ్యగా ఉన్నా తిన్నా ఏం కాదట. మంచిదేనట. మనకు తీపి తినాలన్న కోరిక కూడా తీరుతుంది ఆరోగ్యానికి కూడా ఏ విధమైన హానీ ఉండదు అనుకుంటారు. కానీ ఇవి అంత సురక్షితం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (World Health Organization – WHO) హెచ్చిరిస్తోంది. చూయింగమ్‌లు, యోగర్ట్ లలో కూడా కనిపించే అస్పర్టమే మనుషులకు కార్సినోజెనిక్ గా పరిణమించే ప్రమాదం ఉందని WHO అధికారులు తెలిపారు.
అస్పర్టమే (Aspartame) అనే ఆర్టిఫిషియల్ స్విటెనర్ మనుషుల్లో క్యాన్సర్‌కు కారణం అవుతుందట. WHOకు చెందిన ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ ఆన్ క్యాన్సర్‌కు చెందిన నిపుణులు ఈ స్వీటెనర్ వినియోగం కాలేయ క్యాన్సర్‌కు కారణం కావచ్చనే ఆధారాలు పరిమిత స్థాయిలో ఉన్నట్లు పేర్కొన్నారు.
సాఫ్ట్ డ్రింక్స్ వాడకం కంటే నీళ్లు తాగడం అన్నింటికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రీషుగర్లు, స్వీటెనర్లు లేని చాలా ఉత్పత్తులు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. వాటిని ఎంచుకోవడం మంచిదని ఎక్స్ పర్ట్స్ సలహా ఇస్తున్నారు. బరువు తగ్గేందుకు షుగర్ ఫ్రీ స్వీటెనర్లను వినియోగించకూడదని డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాలను గత నెలలోనే విడుదల చేసింది. ఈ రసాయనాలు గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్‌కు దారితీస్తున్నాయి. కొత్తగా చేపట్టిన మూడు అధ్యయనాల ఆధారంగా అస్పర్టమే కాలేయ క్యాన్సర్‌ను కలిగించవచ్చని కూడా హెచ్చరిస్తోంది.
ఈ వివరాలు అందిస్తూనే ఇప్పటి వరకు మార్కెట్‌లో ఉన్న అన్ని ఉత్పత్తుల్లోనూ దీని వినియోగం పరిమితులకు లోబడే ఉన్నట్టు వెల్లడి చేశారు. కనుక తీసుకున్నంత మాత్రాన్న క్యాన్సర్ బారిన పడతారని కంగారు పడాల్సిన అవసరం లేదు. వీలైనంత వరకు చక్కెరల వినియోగం తగ్గించుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండొచ్చనేది నిపుణుల మాట.
తీపి తగ్గించి తినాల్సిందిగా ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. డైట్ కూల్ డ్రింక్స్, సాఫ్ట్ డ్రింక్స్ వినియోగం చాలా రకాలుగా శరీరానికి నష్టం చేస్తుందనే విషయాన్ని మరోసారి డబ్ల్యూహెచ్ఓ తన కొత్త నివేదిక ద్వారా ప్రపంచానికి తెలియజేస్తోంది. షుగర్ ఫ్రీ అని ఆర్టిఫిషియల్ స్వీటెనర్ల వినియోగం వల్ల మొదటికే మోసం రావచ్చు. కాబట్టి నో మీన్స్ నో అంతే కానీ అది వేరే దారిలో తీర్చుకోవాలనుకోవడం తప్పే అవుతుంది.