కాంగ్రెస్ గ్యారంటీలకు వారంటీ లేదని హేళన చేశారని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్‌కు వారంటీ లేదన్న వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘జన జాతర’ పేరుతో బహిరంగ సభలో సీతక్క మాట్లాడారు. ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై ధరల భారం మోపాయని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో హామీ అమలు చేస్తుంటే బీఆర్ఎస్ భయపడుతోందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి పదవి మొదలుకుని మహిళలకు ఎన్నో కీలక పదవులు ఇచ్చిందని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పారు. గత ప్రభుత్వం మహిళల అభయహస్తం డబ్బులను కూడా వాడుకున్నదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ రూ.105కే 9 సరుకులు ఇచ్చిందన్న మంత్రి సీతక్క.. ఇప్పుడు కూడా పేదలపై ధరల భారం పడొద్దని రూ.500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని వెల్లడించారు. పేదల ఇళ్లకు వెలుగులు పంచేలా రూ.200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని అన్నారు.