తెలంగాణ వ్యవసాయ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలతో వడగండ్లు, గాలి వానలతో నష్టపోయిన రైతుల వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే పేర్కొన్న 2200 ఎకరాలకు అదనంగా నిన్న కురిసిన అకాల వర్షాలకు ఇంకొక 920 ఎకరాలలో పంట నష్టం సంభవించినట్లు రంగారెడ్డి, జనగాం, నిర్మల్ జిల్లాలలో కొత్తగా పంట నష్టం నమోదైనట్లు అధికారులు తెలియజేశారు. ఇప్పటికే మార్చి నెలలో కురిసిన వడగండ్ల వానలకు పంటనష్ట పరిహారము విడుదల చేయుటకు ప్రభుత్వం…తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆమోదం కొరకు విజ్ఞప్తి చేసిన సంగతి విదితమే.
దానికి సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా ఎన్నికల సంఘమును మరొక్కమారు సంప్రదించి నిధుల విడుదలకు అనుమతులు పొందేలా విజ్ఞప్తి చేయుమని, వాటితో పాటే ఇప్పుడు జరిగిన నష్టాన్ని కూడా తొందరగా మదింపు చేసి నివేదిక సమర్పించవలసిందిగా మంత్రి వర్యులు అధికారులను కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ పంట నష్టానికి సంబంధించిన నివేదికలు అందిన వెంటనే పరిహార నిధులు విడుదల చేయుటకు సిద్దంగా ఉన్నదని మంత్రి గారు మరొక్కమారు ఉద్ఘాటించారు. అదేవిధంగా వానాకాలం ముందు సరఫరా చేసే పచ్చి రొట్టె విత్తనాల సేకరణ కోసం టెండర్ల ప్రక్రియను నిర్వహించుటకు అనుమతి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘానికి కృతజ్ఞతలు తెలియజేశారు.