సీఎం రేవంత్ రెడ్డి చేతకాని వాడు కాదు.. దెబ్బకు దెబ్బ తీస్తాం : ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి

-

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ కోరడంపై పరిగి కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పందించారు. గాంధీభవన్ లో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ తీరు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్ళ పాటు విచ్చల విడిగా ఫిరాయింపులను ప్రోత్సహించింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ చివరకు సీపీఐ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి మీ పార్టీలో చేర్చుకోలేదా అని నిలదీశారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో శాసనసభ్యులను చేర్చుకున్నది మీరు కాదా కడిగిపారేశారు. పదేళ్లలో ఇతర పార్టీల నుంచి మొత్తం 39 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యే లను బీఆర్ఎస్ చేర్చుకుందని గుర్తు చేశారు.

2014లో 23 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు.. ఇందులో టీడీపీ నుంచి 12 మంది, కాంగ్రెస్ నుంచి 5 గురు, వైసీపీ నుంచి ముగ్గురు, బీఎస్సీ నుంచి ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరిని చేర్చుకున్నారని అన్నారు. 2018లో 16 మందిని చేర్చుకోలేదా..? కాంగ్రెస్ నుంచి 12 మంది, తెలుగుదేశం నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్లు ఇద్దరిని చేర్చుకున్నారని గుర్తు చేశారు. కేటీఆర్, హరీష్ రావు ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి ప్రలోభపెట్టింది మరిచిపోయారా అని ఎద్దేవా చేశారు. టీడీపీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే తలసానితో రాజీనామా చేయించకుండా మంత్రి వర్గంలోకి తీసుకోలేదా..? కాంగ్రెస్లో గెలిచిన సబితా ఇంద్రారెడ్డిని మీ మంత్రివర్గంలోకి తీసుకోలేదా..? అప్పటి స్పీకర్లు మధుసూధనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి అనర్హత పిటిషన్లలపైన చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version