గ్రేటర్ కార్పొరేటర్‌ టికెట్ల రేస్‌లో ఎమ్మెల్యేలు…!

టీఆర్‌ఎస్‌లో గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల హీట్ రాజుకుంటోంది. టికెట్లు ఆశిస్తున్న వారిలో స్థానిక లీడర్లు ఆశవహుల కంటే ఎమ్మెల్యేలే ముందు వరసలో ఉన్నారట. బంధువులను బరిలో దింపేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతుండటం పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

 

గ్రేటర్‌ హైదరాబాద్‌ క్రమంగా ఎన్నికల మూడ్‌లోకి వెళ్తోంది. అన్ని పార్టీలు డివిజన్లపై ఫోకస్‌ పెట్టాయి. అధికార టీఆర్‌ఎస్‌లో అయితే బరిలో దిగే ఆశావహులు లాబీయింగ్‌ మొదలుపెట్టేశారు. టికెట్ల కోసం ఉద్యమకారులు, పార్టీలోని ఓ మోస్తరు నాయకులు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు సిట్టింగ్‌ కార్పొరేటర్ల పనితీరు బాగోలేదని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించడంతో ఆయా స్థానాలు ఏంటన్నదానిపై ఆరా తీస్తున్నారు

ఓవైపు సిట్టింగ్‌లు తమ స్థానం పదిలపర్చుకునేందుకు దృష్టి పెట్టగా.. మరోవైపు ఎమ్మెల్యేలు వేస్తున్న ఎత్తుగడలు హీటెక్కిస్తున్నాయట. ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి భార్య హబ్సీగూడ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈ దఫా మళ్లీ పోటీ చేయించాలని ఆయన అనుకుంటున్నారు. ఇటీవల వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను స్థానికులు నిలదీయడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆ వీడియో వైరల్‌ అయింది. అందుకే.. ఆమెకు మరోసారి టికెట్‌ ఇస్తే ప్రజల్లో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉందని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయట.

మైలార్‌దేవ్‌పల్లి సిట్టింగ్‌ కార్పొరేటర్‌.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్‌లో ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. ఆ కార్పొరేటర్‌ బీజేపీలో చేరడంతో ఈసారి అక్కడ ఎమ్మెల్యే సోదరుడు ప్రేమదాస్‌ గౌడ్‌ను బరిలో దించుతారని ప్రచారం జరుగుతోంది. నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. చర్లపల్లి డివిజన్‌ కార్పొరేటర్‌గా ఉన్నారు. ఈసారి రామ్మోహన్‌ తన భార్య శ్రీదేవిని పోటీ చేయిస్తారని సమాచారం. మియాపూర్ కార్పొరేటర్‌ మేక రమేశ్‌ చనిపోవడంతో అక్కడ కొత్త అభ్యర్థి బరిలో ఉంటారు. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తన సమీప బంధువును ఇక్కడ పోటీ చేయిస్తారని అనుకుంటున్నారు.

బాలాజీ నగర్‌ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పన్నాల కావ్య టీఆర్‌ఎస్‌ను వీడి బీజేపీలో చేరడంతో.. అక్కడ ఈ దఫా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బంధువును బరిలో దించుతారని తెలుస్తోంది. ఎల్బీ నగర్‌ నియోజకవర్గం పరిధిలోని బీఎన్‌ రెడ్డి నగర్‌ కార్పొరేటర్‌గా టీఆర్‌ఎస్‌ నేత రాంమోహన్‌గౌడ్‌ భార్య ఉన్నారు. రామ్మోహన్‌ మొన్నటి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక్కడ గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరడంతో.. ఆయన అనుచరులు BNరెడ్డి నగర్‌ సీటుపై కన్నేశారట.

ఇలా ఎమ్మెల్యేలే తమ కుటుంబ సభ్యులు, బంధువులు, అనుచరుల కోసం రంగంలోకి దిగడంతో చివరకు ఎవరికి టికెట్‌ లభిస్తుందా అన్న ఆసక్తి నెలకొంది.