స్వర్ణ శోభను సంతరించుకుంటున్న తిరుమల క్షేత్రాధిపతి …!

-

తిరుమల క్షేత్రాధిపతి..వరాహస్వామి ఆలయ గోపురానికి స్వర్ణ శోభను తీసుకువస్తోంది టిటిడి. శ్రీవారి ఆనంద నిలయం తరహాలో వరాహస్వామి ఆలయానికి బంగారు తాపడం చేయిస్తోంది టిటిడి. తిరుమలలో క్షణకాలం లభించే స్వామి వారి దర్శనం కోసం గంటల తరబడి వేచిఉంటారు. ఐతే…శ్రీవారి కంటే తిరుమల పుణ్యక్షేత్రంలో వెలసిన దేవుడు మరొకరు ఉన్నారు. విష్ణువు రూపధారియైన వరాహస్వామి తిరుమల క్షేత్రానికి అధిపతి. శ్రీవారి ఆలయం కంటే ముందుగానే తిరుమలలో వరహస్వామి ఆలయం వెలసింది.

శ్రీమహవిష్ణువు ఆది వరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి ఈ క్షేత్రంలో వెలసినారట. అందుకే ఈ క్షేత్రం ఆది వరాహ క్షేత్రంగా ప్రసిద్ది చెందింది. ఆ తరువాత కొంతకాలానికి శ్రీనివాసుడు వైకుంఠం నుంచి ఇక్కడకి వచ్చి ఉండడానికి శ్రీవరాహస్వామివారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడట. అందుకు ప్రతిఫలంగా మొదట దర్శనం, ముందుగా పూజలు, నైవేద్య సమర్పణ వరాహ స్వామికే లభిస్తుందని హామీని శ్రీవారు వరాహస్వామికి ఇచ్చారట. అందుకే ఇప్పటికి ప్రథమ దర్శనం, ప్రథమ పూజ, ప్రథమ నైవేద్యం వరాహస్వామికే అన్నట్టుగా సాగుతుంది.

వరాహ స్వామి ఆలయానికి బంగారు తాపడం కోసం 14 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. ఆరు నెలల కాలంలో పనులు పూర్తి చేస్తారు. ఆరు నెలలు పాటు వరాహస్వామి మూలమూర్తి దర్శనం భక్తులకు లభించదు. డిసెంబర్ నెలలోనే పనులు మొదలు పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అప్పట్లో బంగారు తాపడం పనులు చేయడానికి కోయంబత్తూరుకి చెందిన దాత ముందుకు వచ్చారు అది ఆచరణలోకి రాలేదు. పనులు ప్రారంభం ఆలస్యం కావడంతో ఇప్పుడు టిటిడి దానికయ్యే మొత్తం వ్యయం భరిస్తోంది. 14 కోట్ల రూపాయల వ్యయంతో…42 కేజీల బంగారం వినియోగిస్తారు. వరాహస్వామి గోపురానికి బంగారు కాంతులు వెదజల్లేలా తాపడం పనులు చేయిస్తోంది టిటిడి.

Read more RELATED
Recommended to you

Latest news