దిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ.. తీర్పు రేపటికి వాయిదా

-

దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా తిహాడ్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఆమె ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ పిటిషన్ పై ఇవాళ దిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయగా 2 పిటిషన్లు కలిపి ఇవాళ దిల్లీ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

కవిత తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆమె అరెస్టు నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, కేసు నమోదు చేసినప్పుడు ఎఫ్​ఐఆర్​లో కవిత పేరు లేదని తర్వాత కోర్టులో దాఖలు చేసిన చార్జ్​షీట్​లో పేరు ప్రస్తావించారని కోర్టుకు తెలిపారు. అరెస్టు చేసిన తర్వాత బెయిల్​ కోరితే ట్రయల్​ కోర్టు ఇవ్వలేదని, ఆమెకు ఇద్దరు మైనర్ పిల్లలు ఉన్నారని వారికి పరీక్షలు ఉన్నాయని విజ్ఞప్తి చేసినా కనికరం చూపలేదని కోర్టుకు చెప్పారు.

ఆయన వాదనలు విన్న అనంతరం దర్యాప్తు సంస్థలు తమ వాదనలు వినిపించమని కోరగా.. వారు రేపు వినిపిస్తామని కోర్టుకు తెలిపారు. పలు డాక్యుమెంట్లతో భౌతికంగా రేపు కోర్టులో వాదనలు వినిపిస్తారని ఈడీ, సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఈ నేపథ్యంలో విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. మంగళవారం రోజున దర్యాప్తు సంస్థల వాదనలు విన్న అనంతరం ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news