నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం బీజేపీఎంపీ అభ్యర్థి, ప్రస్తుత పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకో మండలంలో ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలో పదేళ్లలో మోదీ తీసుకువచ్చిన పథకాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆర్మూర్ మండలంలోని అంకాపూర్‌లో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అర్వింద్మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై మండిపడ్డారు. అప్పులు చేసి పథకాలు అమలు చేయడం గొప్పకాదని.. ఉత్పాదకతతో ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అన్నారు. అభివృద్ధికి కేంద్రం సహకరిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించట్లేదని ఆరోపించారు. అవినీతి, అక్రమాలతో వ్యవస్థలను నిర్వీర్యం చేశారని.. రేషన్ బియ్యంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రీసైక్లింగ్ దందా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులు, మహిళకు బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని.. అందుకే ఈ ఎన్నికల్లో కమలం గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని కోరారు.