బీజేపీతో అంతర్గతంగా బీఆర్ఎస్ పార్టీ ఒప్పందం పెట్టుకుందని ఎంపీ వెంకటేశ్ నేత ఆరోపించారు. ఈ రెండు పార్టీల పొత్తు సహించలేకనే గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరినట్లు వెల్లడించారు. ఇటీవలే ఆయన దిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ సమక్షంలో హస్తం కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. పెద్దపల్లి ఎంపీగా ఉన్న వెంకటేశ్ నేత ఆకస్మిక రాజీనామా ఓ రకంగా బీఆర్ఎస్‌కు గట్టి షాక్ ఇచ్చిందని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
అయితే తాను ఆ పార్టీకి రాజీనామా చేయడానికి గల కారణాన్ని తాజాగా ఎంపీ వెంకటేశన్ నేత తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ అంతర్గత ఒప్పందమే దీనికి కారణమని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటులో రాష్ట్రం తరపున మాట్లాడానని అన్నారు. రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువచ్చానని వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన అంశాలపై లోక్‌సభలో తన గళం వినిపించానని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని బీఆర్ఎస్ పార్టీలో చర్చకు వచ్చిందని, అది తనను బాధించిందని అన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీకి తాను రాజీనామా చేసేందుకు దారి తీసిందని వివరించారు.