బీఆర్ఎస్ పట్ల ముదిరాజుల్లో వ్యతిరేకత…అందుకే ఓటమి

-

తెలంగాణలో హ్యాట్రిక్ కొట్టాలని ఆశ పడిన బీఆర్ఎస్ కి ఓటమి ఎదురైంది. వాళ్ళ ఆశలకు గండి కొట్టింది కేవలం ఒక కులం ఓట్లు అంటే నమ్మశక్యం కాదేమో.కానీ ఇది ముమ్మాటికీ నమ్మాల్సిన నిజం.తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువ. ప్రతి ఎన్నికల్లో రాజకీయ పక్షాల గెలుపోటములను వీళ్ళే నిర్దేశిస్తారు.60 లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్ లకు రాజకీయంగా ప్రాధాన్యత దక్కడం లేదు. ఈ అసంతృప్తి వారిలో ఎప్పటినుంచో ఉంది.ప్రస్తుత కులాల చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయ్.అందుకే తెలంగాణకు ఒకరు బీసీ ముఖ్యమంత్రి ని చేస్తామంటే, మరొకరు దళిత వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామనడం ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారల్లో విన్నాం. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో వారికి దక్కిన ప్రధాన్యత చాలా తక్కువనే చెప్పాలి. అందుకే వారు ఈసారి కాంగ్రెస్ కి ఓట్లు గుద్దినట్లు తెలుస్తోంది.

2023 నవంబరు వరకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు కేబినెట్ లో మొత్తం 18 మంది మంత్రులు పనిచేశారు. ఇందులో ఒకరు MIM కు చెందిన వ్యక్తి కూడా వున్నారు. అయితే ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు రెండు పర్యాయాల్లోనూ కేసీఆర్ మొండి చేయి చూపారు. అంతేకాదు ముదిరాజ్ లకు ప్రత్యేకంగా దళిత బంధు తరహాలో ఒక పథకం కూడా తీసుకురాక పోవడం కూడా బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత పెరిగేలా చేసింది. 60 లక్షలకు పైగా ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి ఆఖరికి ఒక నామినేట్ పోస్టు కూడా దక్కలేదంటే…వారికి కేసీఆర్ ఇచ్చిన ప్రాధాన్యం ఎలాంటిది అర్థం చేసుకోవచ్చు.అరశాతం లేని వెలమ సామాజిక వర్గానికి కీలక పదవులను ఇవ్వడమే కాదు పరిపాలన అంతా వారి చేతుల్లోనే పెట్టారు కేసీఆర్. అటు ప్రభుత్వంలో కానీ ఇటు ప్రభుత్వేతర పదవుల్లో కానీ ముదిరాజ్ లకు దక్కిన ప్రాధాన్యం ఏమీలేదు. అందుకే ఈసారి ముదిరాజ్ లు నిర్ణయం మార్చుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ముదిరాజ్ సామాజిక వర్గం ఓట్లు అధికారాన్ని నిర్ణయిస్తాయి. బీసీ ముఖ్యమంత్రి నినాదాన్ని బీజేపీ గట్టిగా వినిపించినా ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించినా వాటికి ముదిరాజ్ లు పట్టించుకోలేదు.ఒకవేళ ముదిరాజ్ లు ఒక్కటై ఓట్లు గుద్ది ఉంటే బీజేపీ కి కనీసం 30 సీట్లు అయినా వచ్చి ఉండేవి. కానీ ఈ ఓట్లన్నీ కాంగ్రెస్ కి పడినట్లు విశ్లేషకుల వాదన. వారి సపోర్ట్ వలనే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలుస్తోంది.మరి కాంగ్రెస్ అయినా ముదిరాజ్ సామాజిక వర్గానికి సరైన గుర్తింపు ఇస్తుందేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version