కవిత అరెస్ట్‌లో నిబంధనల ఉల్లంఘన లేదు : రౌజ్‌అవెన్యూ కోర్టు

-

దిల్లీ లిక్కర్ కేసులో తనను అరెస్ట్‌ చేసే విషయంలో పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద ఉన్న నిబంధనలను ఈడీ పాటించలేదన్న ఎమ్మెల్సీ కవిత వాదనలను రౌజ్‌ అవెన్యూ కొట్టివేసింది. ఆమె అరెస్ట్‌ విషయంలో ఈడీ నిబంధనల ప్రకారమే నడుచుకొందని స్పష్టం చేసింది. ఈ నెల 15వ తేదీన హైదరాబాద్‌లో కవితను ఈడీ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. 16న కోర్టులో హాజరు పరిచి.. కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేయగా.. ఆ పిటిషన్‌పై న్యాయమూర్తి వెలువరించిన తీర్పు కాపీ తాజాగా బయటికొచ్చింది.

దిల్లీలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వోద్యోగులకు రూ.100 కోట్ల లంచాలు ఇచ్చిన సౌత్‌ గ్రూప్‌లో నిందితురాలు భాగస్వామిగా ఉన్నట్లు, దిల్లీ ఎక్సైజ్‌ విధానాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవడానికి తొలి నుంచీ నేరపూరిత కుట్రలో పాలుపంచుకున్నట్లు ఆరోపణలున్నాయని రౌజ్ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్‌పాల్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పీఎంఎల్‌ఏ చట్టంలోని సెక్షన్‌-19 కింద పొందుపరిచిన అన్ని రకాల రక్షణలను అనుసరించే నిందితురాలిని ఈడీ అధికారులు అరెస్ట్‌ చేయడమే కాకుండా.. అరెస్ట్‌కు కారణాలను ఆమెకు లిఖితపూర్వకంగా ఇచ్చారని తెలిపారు. సీఆర్‌పీసీ సెక్షన్లు 80, 81 ప్రకారం ట్రాన్సిట్‌ రిమాండ్‌ లేదని నిందితురాలు చెబుతున్నారన్న ఆయన, సెక్షన్‌-19లోని నిబంధనల ప్రకారం ఆ అవసరం లేదని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news