చేనేత కార్మికులపై రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమలు, చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ వరాల జల్లు కురిపించారు. చేనేత రంగం సమగ్రాభివృద్ధి, నేతన్నల సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపింది. ఇందులో భాగంగానే.. ఇప్పటివరకు 59 సంవత్సరాలలోపు వయసు వారికే అమలవుతున్న నేతన్న బీమా పథకాన్ని.. ఇక నుంచి 75 ఏళ్ల వయసు వరకు వర్తింపజేయనున్నట్లు మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ పథకానికి రూ.50 కోట్లు కేటాయించినట్లు తెలిపారు.
నూతనంగా ‘తెలంగాణ చేనేత మగ్గం’ పథకం పేరుతో ఇప్పటివరకు ఉన్న గుంట మగ్గాల స్థానంలో ఫ్రేమ్‌మగ్గాలు అందించనున్నట్లు ప్రకటించారు. రూ.38 వేల చొప్పున రాష్ట్రంలో 10,652 ఫ్రేమ్‌మగ్గాలకు రూ.40.5 కోట్లు కేటాయించామని వెల్లడించారు.. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం రోజున హైదరాబాద్ నగర శివారు మన్నెగూడలో నిర్వహించిన సంబరాల్లో కేటీఆర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
‘నేతన్నల కష్టాలు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలుసు. చేనేత కార్మికులకు ప్రత్యేకంగా ఆరోగ్యకార్డులు అందజేసి ఒక్కో కుటుంబానికి ఏటా రూ.25 వేల వరకు వైద్య సదుపాయం అందిస్తాం. ఆర్థిక భద్రత కల్పించే నేతన్నకు చేయూత పథకాన్ని 2024 వరకు కొనసాగిస్తున్నాం. దీంతో 36,098 మంది లబ్ధిపొందుతారు.’ అని కేటీఆర్ అన్నారు.