NHAI : ఆ ట్వీట్‌తో దిల్లీ నుంచి హైదరాబాద్‌కు..

-

హైదరాబాద్‌ శివారులో జాతీయ రహదారి 65 అధ్వానంగా ఉందంటూ ఓ నెటిజన్‌ జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ)కు ట్విటర్‌లో ట్యాగ్‌ చేశారు. ఆ ట్వీట్‌ని చూసిన సంస్థ ఛైర్‌పర్సన్‌ అల్కా ఉపాధ్యాయ మంగళవారం స్వయంగా దిల్లీ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. దెబ్బతిన్న ప్రాంతం తెలంగాణ ప్రభుత్వ నియంత్రణలో ఉన్న జాతీయ రహదారని అధికారులు స్పష్టం చేసినప్పటికీ ఆ ప్రాంతంతో పాటు సూర్యాపేట వరకూ స్వయంగా పరిశీలించారు.

టోల్‌ రహదారి మొదలయ్యే మల్కాపూర్‌ నుంచి సూర్యాపేట వరకూ రహదారి నిర్వహణ విషయంలో సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ట్రాఫిక్‌ రద్దీ దృష్ట్యా ఎల్బీనగర్‌ నుంచి మల్కాపూర్‌ వరకూ సర్వీస్‌ రహదారులతో ఆరు వరుసల విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవంలో భాగంగా పంతంగి టోల్‌ప్లాజా వద్ద జీఎమ్మార్‌ వరలక్ష్మీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఈ సందర్భంగా అల్కా ఉపాధ్యాయ ప్రారంభించారు. ట్వీట్‌ నేపథ్యంలో ఛైర్‌పర్సన్‌ హైదరాబాద్‌ వచ్చిన విషయం వాస్తవమేనని ఓఅధికారి చెప్పారు.

తెలంగాణలో జాతీయ రహదారుల సంస్థ చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచాలని అల్కా ఉపాధ్యాయ అధికారులను ఆదేశించారు. ఆయా పనులపై మంగళవారం ఆమె హైదరాబాద్‌లో సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్‌-విజయవాడ, హైదరాబాద్‌-బెంగళూరు, నాగ్‌పుర్‌-విశాఖపట్నం తదితర మార్గాల పనులతో పాటు ప్రాంతీయ రింగు రోడ్డు ఉత్తర భాగం జంక్షన్లు, భూసేకరణ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో ప్రాంతీయ అధికారి ఎ.కృష్ణప్రసాద్‌, అధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news