నీతిఆయోగ్ రిపోర్ట్: తెలంగాణలో ఘోరం.. ప్రతి లక్ష మందికి అందుబాటులో 10 పడకలు మాత్రమే!

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రతి లక్ష మందికి కేవలం 10 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నట్లు నీతి ఆయోగ్ నివేదికలో వెల్లడైంది. మొత్తం 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో చేపట్టిన సర్వేలో వైద్య సదుపాయాలలో తెలంగాణ రాష్ట్రం కింది నుంచి మూడో స్థానం అంటే 34వ స్థానంలో నిలిచింది. ప్రతి లక్ష మందికి 222 పడకల లభ్యతతో కేంద్రపాలిత ప్రాంతం పుదిచ్చేరి అగ్రస్థానంలో ఉండటం గమనార్హం.

జిల్లా హాస్పిటళ్లలో ఉత్తమమైన సదుపాయాల ఆధారంగా చేపట్టిన సర్వే వివరాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది.

దేశంలో ప్రతి లక్ష మందికి సగటున 24 పడకలు అందుబాటులో ఉన్నట్లు వెల్లడైంది. కేవలం 6 పడకల అందుబాటులో అట్టడుగు స్థానంలో బిహార్, అత్యధికంగా 222 పడకల లభ్యతతో పుదిచ్చేరి అగ్రస్థానంలో నిలిచింది.

ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(ఐపీహెచ్‌ఎస్) 2012 మార్గదర్శకాల ప్రకారం ప్రతి లక్ష జనాభా(2001 జనాభా లెక్కల ప్రకారం)కు జిల్లా హాస్పటళ్లలో 22 పడకలను అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. 2018-19 మధ్య కాలంలో 36 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 707 జిల్లా హాస్పిటళ్లలో సర్వే ఆధారంగా అంచనా వేసింది.

దేశం ప్రతి లక్ష జనాభాకు జిల్లా హాస్పిటళ్ళలో 1 నుంచి 408 పడకలు అందుబాటులో ఉన్నట్లు నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. దాదాపు 217 జిల్లా హాస్పిటళ్లలో ప్రతి లక్ష జనాభాకు 22 పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపింది. ఈ సర్వే దేశంలో కొవిడ్-19 మహమ్మారి ప్రబలక ముందు చేపట్టారు.

నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం ప్రతి లక్ష జనాభాకు 22 పడకల కంటే తక్కువగా 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నాయి.
బిహార్(6), జార్ఖండ్(9), తెలంగాణ(10), ఉత్తరప్రదేశ్(13), హర్యానా(13), మహారాష్ట్ర(14), జమ్ముకశ్మీర్(17), అసోం(18), ఆంధ్రప్రదేశ్(18), పంజాబ్(18), గుజరాత్(19), రాజస్తాన్(19), పశ్చిమబెంగాల్(19), ఛత్తీస్‌గఢ్(20), మధ్యప్రదేశ్‌(20) పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ హాస్పిటళ్లలో సౌకర్యాలలో అధమ స్థానంలో ఉండటం గమనార్హం. మరీ, తెలంగాణలో దారుణంగా ప్రతి లక్ష జనాభాకు కేవలం 10 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ కూడా మెరుగైన స్థితిలో లేదు. ఇక్కడ ప్రతి లక్ష జనాభాకు కేవలం 18 పడకలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news