శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు గత కొద్ది రోజుల నుంచి ఖాళీగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు ప్రొటెం చైర్మన్ చేత శాసన మండలి సమావేశాలను నిర్వహించారు. సోమవారం నాటి బడ్జెట్ ను కూడా ప్రొటెం ఛైర్మన్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రవేశ పెట్టారు. కాగ ప్రస్తుతం శాసన మండలి ఛైర్మన్, వైస్ చైర్మన్ పదువులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందు కోసం నోటిఫికేషన్ విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
కాగ నోటిఫికేషన్ విడుదలకు ముందు.. శాసన మండలి చైర్మన్, వైస్ చైర్మన్ పదవుల భర్తీకి గవర్నర్ తమిళ సై నుంచి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి. అనుమతి అనంతరం నోటిఫికేషన్ విడుదల చేస్తారు. తర్వాత గురువారం నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం ఉంటుంది. అయితే మండలిలో అతి పెద్ద పార్టీ టీఆర్ ఎస్ ఉంది.
కాబట్టి.. నామినేషన్లు కేవలం టీఆర్ఎస్ నుంచి వచ్చే అవకాశం ఉంది. బలం లేకపోవడంతో కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ఈ ఎన్నికలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. కాగ శాసన మండలికి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ గా బండా ప్రకాశ్ ఎన్నిక అయ్యే అవకాశాలు ఉన్నాయి.