ఎన్టీఆర్ ఫ్యాన్స్ హెచ్చరిక: ఆ విషయంలో చంద్రబాబుని ఫాలో అవ్వద్దు కేసీఆర్!

-

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి ఉత్సవాలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఘనంగా ప్రారంభించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లోని “పీవీ జ్ఞానభూమి”లో ఆయనకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాట్లాడిన కేసీఆర్… పీవీకి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు తాను ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలిసి విన్నవిస్తానని.. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబసభ్యులను కూడా భాగస్వాములను చేస్తానని అన్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ… ఈ విషయంలో కేసీఆర్.. బాబును ఫాలోఅవ్వరు కదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి!

పార్టీ ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా.. ప్రజలకు దూరమవుతుందన్న ఫీలింగ్ వచ్చినా.. మహానాడులో బలమైన మాట ఏదో ఒకటి మాట్లాడాలన్న.. ఎన్టీఆర్ వర్ధంతి అయినా, జయంతి అయినా… “ఎన్టీఆర్ కు భారతరత్న” డిమాడ్ ను వినిపిస్తుంటారు చంద్రబాబు! ఆ నాలుగైదు సందర్భాల్లో మాత్రమే.. అది కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే బాబుకు ఆ విషయం గుర్తుకువస్తుంటుంది!

ఎన్టీఆర్ మరణానంతరం మూడుసార్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ.. కేంద్రంలో చక్రం తిప్పాను అని చెప్పుకునే అధ్యక్షుడిని కలిగిఉన్న పార్టీ.. కేంద్రంలోని ప్రభుత్వాలలో మంత్రులను కలిగి ఉన్న పార్టీ.. “ఎన్టీఆర్ కు భారతరత్న” విషయంలో ఇప్పటివరకూ మాటలకే పరిమితమైంది.

ఇందులో పరిపూర్ణమైన చిత్తశుద్ధిలోపం కనిపిస్తుందనడంలో ఎవరికీ సందేహం ఉండనక్కరలేదు! ఎందుకంటే.. వారికి “ఎన్టీఆర్ కు భారతరత్న” అనేది ఒక రాజకీయ అవసరంగా, ఒక రాజకీయ డిమాండ్ గా ఉండాలే తప్ప… ఆయనకి ఆ స్థాయి ఖ్యాతి అధికారికంగా రావడం ఇష్టం ఉండి ఉండకపోవచ్చు! దానికి వారికుండే రాజకీయ, కుటుంబ కారణాలు వారివి!!

సో… “ఎన్టీఆర్ కు భారతరత్న” అనేది వారి రాజకీయ అవసరమే తప్ప మరొకటి కాదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపణ అయ్యింది. ఆ సంగతి అలా ఉంటే… తాజాగా తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ జాతిరత్నం మాజీ ప్రధాని పీవీ నరసింహరావు జయంతి ఉత్సవాల సందర్భంగా కేసీఆర్ కూడా “పీవీకి భారతరత్న” అనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు.

పీవీని సొంతం చేసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ.. చేయకూడనన్ని తప్పులు చేసేసింది! ఫలితంగా పీవీ ని మాజీప్రధానిగా ఉంచిందే తప్ప.. వారి పార్టీ మనిషిగా క్రెడిట్ పొందలేకపోయింది! ఫలితంగా… పీవీని తెలంగాణ పేరు చెప్పి తెరాస సొంతం చేసుకునే ప్రయత్నం షురూ చేసింది! దీంతో.. “పీవీకి భారతరత్న” అనే డిమాండ్ ను తెరపైకి తెచ్చారు కేసీఆర్.

అది నిజంగా తెలంగాణ బిడ్డపై కేసీఆర్ కి ఉన్న ప్రేమకు చిహ్నం అయితే.. కచ్చితంగా వీలైనంత తొందర్లో, అతి తొందర్లో ఆపని కేసీఆర్ సాధించగలుగుతారు. అది కేసీఆర్ లాంటి ముఖ్యమంత్రి తలచుకుంటే పెద్ద విషయం కాదు.. చిత్తశుద్ధి లోపం ఉండనిపక్షంలో!! అలా కానిపక్షంలో… “బాబుకు ఎన్టీఆర్ దొరికినట్లే.. కేసీఆర్ కు పీవీ దొరికారనే” కామెంట్లకు అవకాశం ఇచ్చినట్లవుతుంది. భారతరత్న విషయంలో కేసీఆర్ కూడా బాబును ఫాలోఅవుతున్నారనే విమర్శలకు తావిచ్చినట్లవుతుంది!

ఈ సమయంలో చంద్రబాబు కూడా “ఎన్టీఆర్ కు భారతరత్న” డిమాండ్ ను రాజకీయంగా వాడుకుని పెద్దాయన ఆత్మను క్షోభ పెడుతున్నారని.. తమరు అదే విధానాన్ని ఫాలో అయ్యి పీవీ ఆత్మను క్షోభ పెట్టొద్దని సూచిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్. సాధించుకునే ధమ్ముంటేనే మాట ఇవ్వాలని, అలా కాకుండా “పీవీకి భారతరత్న” డిమాండ్ ను రాజకీయంగా, ఓటు బ్యాంకు అస్త్రంగా వాడుకునే విషయంగా మాత్రమే ఉంచితే… భారతరత్న విషయంలో బాబు – కేసీఆర్ లు ఒకతానులో ముక్కలేనన్న విషయం చరిత్ర పుటల్లో మిగిలిపోతుందని హెచ్చరిస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news