తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి చేదు వార్త తెలిపింది. గతంలో మాదిరి వాహనాల పీయూసీ (పొల్యూషన్ అండర్ కంట్రోల్) సర్టిఫికెట్ తమకు గుర్తొచ్చినప్పుడు తీసుకుంటామంటే ఇక నుండి కుదరదు. వాహనాల పీయూసీ(Pollution Under Control) సర్టిఫికెట్ గడువు ఒక్క రోజు దాటినా మీ వాహనానికి ఫైన్ విధించనున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ఆన్‌లైన్ విధానం ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి టెండర్ల ప్రక్రియ కూడా మొదలైంది.
నూతన ఆన్‌లైన్ విధానంపై ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ కమిటీ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నూతన విధానంలో వాహన కాలుష్య పరీక్షలు, ఫలితాల్ని ఆన్‌లైన్ చేయడం ద్వారా మీ వాహనానికి కాలుష్య పరీక్ష చేసిన వివరాలు నేరుగా సర్వర్‌లో సేవ్ అవుతాయి. ఇక కాలుష్య పరీక్ష చేయించి ఆరు నెలలు దాటితే… ఆటోమాటిక్ గా జరిమానా పడనుంది. ఆగస్టులో ఈ కొత్త విధానం అమల్లోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఈ నూతన ప్రక్రియను తొలుత హైదరాబాద్‌లో అమలు చేసి తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో అధికారులు ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో వాయుకాలుష్యంలో దాదాపు 50శాతానికి పైగా వాహనాల నుంచే వస్తోండగా… హైదరాబాద్‌లోని వాహనాల నుంచే రోజుకు 1,500 టన్నుల కాలుష్య ఉద్గారాలు విడుదలవుతున్నాయి.