తెలంగాణలో ప్రస్తుతం హైడ్రా, మూసీ పునరుజ్జీవం గురించి అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ప్రభుత్వం అధికార వచ్చిన పది నెలల్లోనే పేదలు, రైతులు, మహిళల కోసం అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేశామని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో కావాలనే మాపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు.
ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై ప్రజల మనస్సుల్లో అపనమ్మకాలను పెంచుతున్నారని పేర్కొన్నారు. ప్రతిపక్షాల మాయలో ప్రజలు పడకుండా.. వాస్తవాలను గ్రహించాలని సూచించారు. పదేళ్లలో బీఆర్ఎస్ 70వేల ఉద్యోగాలిస్తే.. కేవలం 10 నెలల్లోనే మా ప్రభుత్వం 50వేల ఉద్యోగాలు ఇచ్చిందని తెలిపారు. మరోవైపు మైడ్రా ద్వారా చెరువులు, కుంటల ఆక్రమణదారులకు భయం పుట్టేవిధంగా చేసామని సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో చెరువులు, నాలాలను ఆక్రమించి వర్షపు నీరు కాలువలలోకి వెళ్లకుండా చేసి.. చిన్న వర్షాలకే నగరమంతా జలమయం అయ్యేవిధంగా చేస్తే.. బాగుంటుందా..? అని ప్రశ్నించారు పీసీసీ చీఫ్. మూసీ నదికి పర్యాటక శోభ తీసుకొస్తామని తెలిపారు.