అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను లోక్సభ ఎన్నికల్లో పునరావృతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది. మరోవైపు పటిష్ఠ కార్యాచరణ, పక్కా ప్రణాళిక, బలమైన వ్యూహాలతో పాటు ప్రజలను ఆకర్షించే మేనిఫెస్టోతో ముందుకు సాగుతోంది. రాష్ట్రం నుంచి 14 ఎంపీ స్థానాలు గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్ని కోణాల్లో పరిశీలించిన అభ్యర్థులను బరిలోకి దింపుతోంది.
మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడానికి అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసేందుకు పీసీసీ కార్యవర్గం ఇవాళ సమావేశం కానుంది. హైదరాబాద్ గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు రోహిత్ చౌదరి, విష్ణునాథ్ సహా ముఖ్యనేతలు పాల్గొననున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తైన నేపథ్యంలో ప్రజాపాలనపై జనం స్పందన, అభివృద్ధి, సంక్షేమ పథకాలు సహా బీఆర్ఎస్ సర్కార్‌లో జరిగిన అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలను కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించనున్నట్లు సమాచారం.