ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. వరంగల్ పర్యటనలో భాగంగా మోదీ శనివారం ఉదయం 7.35 గంటలకు వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని బయలుదేరి.. ఉదయం 9.25గంటలకు హైదరాబాద్ హకీంపేటకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ ద్వారా 10.15 గంటలకు వరంగల్‌లోని మామునూర్ ఏరోడ్రమ్‌కు చేరుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి ఉదయం 11.45 గంటల నుంచి మధ్యాహ్నం 12.20 గంటల వరకు బహిరంగసభలో మాట్లాడనున్నారు. అనంతరం 1.40 గంటలకు తిరిగి హకీంపేటకు చేరుకుని ప్రత్యేక విమానంలో రాజస్థాన్ వెళ్లనున్నారు.
ప్రధాని వరంగల్ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృతస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. రెవెన్యూ, రోడ్లు, భవనాలు, రైల్వే తదితర శాఖలతో ఇబ్బందులు తలెత్తకుండా సమన్వయం చేసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో వరంగల్, హనుమకొండ నగరానికి 20 కిలో మీటర్ల వ్యాసార్థంలో గగనతలాన్ని నో ప్లై జోన్ ప్రకటిస్తూ ఇప్పటికే వరంగల్ కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. హనుమకొండ ఆర్ట్స్ కళాశాల మైదానంలో మోదీ బహిరంగసభ కోసం బీజేపీ నేతలు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే సభా వేదిక, ఇతర ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కాగా.. పార్టీ నేతలు జనసమీకరణలో బిజీ అయ్యారు.