వనపర్తిలో బీఆర్ఎస్ కార్యకర్త శ్రీధర్ రెడ్డి హత్యను మంత్రి జూపల్లి కృష్ణారావు ఖండించారు. గాంధీభవన్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జూపల్లి మాట్లాడారు. హత్య ఘటనలో తన హస్తం ఉందని కేటీఆర్ ఎలా మాట్లాడతారన్నారు. శ్రీధర్ రెడ్డికి, రాజకీయాలకు సంబంధం లేదన్నారు. శ్రీధర్ రెడ్డి కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉన్నాయన్నారు. శ్రీధర్ రెడ్డి వల్ల చాలా కుటుంబాలు బాధ పడ్డాయని తెలిపారు. మాజీ ఎమ్మెల్యేతో శ్రీధర్ రెడ్డికి ఆర్థిక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. శ్రీధర్ రెడ్డి హత్య ఘటనపై పూర్తి విచారణ చేయిస్తామని తెలిపారు.
తాను పార్టీ మారినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలు తనపై కక్షకట్టారని గుర్తు చేశారు. గతంలో రాజకీయ హత్య జరిగిందని తనపై ఆరోపణలు చేశారని.. ఆ హత్య కూడా భూ వివాదం వల్లే జరిగిందని క్లారిటీ ఇచ్చారు. గండ్రపల్లి, లక్ష్మీపల్లిలో రెండు హత్యలపై వాస్తవాలు ప్రజలే చెబుతారని స్పష్టం చేశారు. కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్మీపల్లికి రావాలని జూపల్లి సవాల్ విసిరారు. లక్ష్మీపల్లి కూడలికి వస్తే ప్రజలు ఏది చెబితే అది చేద్దామన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసు పెడతా అని వార్నింగ్ ఇచ్చారు.