తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మునుగోడు ఉప ఎన్నికలో డబ్బు సరఫరాలో పోలీస్ అధికారుల పాత్రపై దర్యాప్తు బృందానికి ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఓ ఐపీఎస్ అధికారి ప్రమేయం ఉన్నట్లు దర్యాప్తు బృందం కీలక సమాచారం సేకరించింది.
2022 నవంబరు 3వ తేదీన జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి కోసం నిబంధనలకు విరుద్ధంగా డబ్బు సరఫరా కోసం పోలీస్ అధికారుల పర్యవేక్షణలో పార్చునర్ వాహనం వినియోగించినట్లు దర్యాప్తులో తేలింది. అప్పట్లో ఆ వ్యవహారంలో ఐపీఎస్ అధికారితో పాటు ఓ డీఎస్పీ కీలకంగా వ్యవహరించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం తేల్చింది. పార్చునర్ వాహనానికి ఎస్కార్ట్ వ్యవహరించిన కానిస్టేబుల్ నుంచి సేకరించిన వాంగ్మూలం ఆధారంగా ఆ విషయాన్ని గుర్తించినట్లు సమాచారం. నల్గొండ టాస్క్‌ఫోర్స్‌లో పని చేసిన కానిస్టేబుల్ అప్పటి తతంగాన్ని దర్యాప్తు బృందానికి పూసగుచ్చినట్లు వివరించారని సమాచారం. విచారణ చేస్తున్నప్పుడు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తమ వాంగ్మూలాల్లో అదే విషయం ధ్రువీకరించారు.