కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఓవైపు పాదయాత్రలు చేస్తూ ప్రజల్లో తమపై సానూకూల అభిప్రాయాన్ని తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు ఆపరేషన్ ఆకర్ష్.. ఘర్ వాపసీలతో ఇతర పార్టీల నేతలను.. ఇతర పార్టీలో చేరిన తమ పార్టీ నేతలను తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ముందుగా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్లో చేర్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. వీరి చేరిక దాదాపు ఖరారైనట్లే తెలుస్తోంది.
అయితే పొంగులేటి, జూపల్లికి ఆ పార్టీ అగ్రనేతల అపాయింట్‌మెంటు లభించింది. ఈనెల 26న రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలవనున్నారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖమ్మంలో 4 సీట్లు, నల్గొండలో 2 సీట్ల ఇవ్వాలని పొంగులేటి కోరుతున్నారు. సమావేశంలో ఈ అంశం కూడా ప్రస్తావనకు రానున్నట్లు సమాచారం. కొత్తగూడెం నుంచి తానే పోటీ చేయాలని పొంగులేటి భావిస్తుండగా…. మిగిలిన నియోజకవర్గాల్లో తన వర్గం నేతలను పోటీ చేయించే యోచనలో ఉన్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ తర్వాత పొంగులేటి, జూపల్లి, కూచికుళ్ల….కాంగ్రెస్ పార్టీలో చేరికపై ప్రకటన చేయనున్నట్లు సమాచారం.