పార్లమెంట్ పాత భవనాన్ని భారతీయుల స్వేదం, డబ్బుతో నిర్మించామన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రారంభం సందర్భంగా పాత పార్లమెంట్ భవనానికి వీడ్కోలు పలుకుతూ ప్రధాని మోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ భవనం ఎప్పుడూ మనల్ని ఉత్తేజ పరుస్తూనే ఉంటుందని అన్నారు. 75 ఏళ్లలో ఎన్నో చారిత్రక నిర్ణయాలను ఈ భవనంలో తీసుకున్నామని మోడీ అన్నారు. ఈ భవనం భావి తరాలకు స్ఫూర్తినిస్తుంది అన్నారు. చరిత్రను గుర్తుచేసుకోవాల్సిన సమయం ఇది అని మోడీ ప్రసంగించారు.
పార్లమెంట్‌లో తాను అడుగు పెట్టినప్పుడు ఎంతో భావోద్వేగం చెందానన్న మోడీ.. ఓ పేదవాడు పార్లమెంట్లో అడుగు పెట్టడం గొప్ప విషయం అన్నారు. పార్లమెంట్ అన్ని వర్గాల వారికీ ప్రాతినిధ్యం కల్పించాలన్న మోడీ.. ఎంతో మంది మహిళా ఎంపీలు.. పార్లమెంట్ గౌరవాన్ని పెంచారని అన్నారు. రాన్రానూ మహిళా ఎంపీల సంఖ్య పార్లమెంట్‌లో రెండు సభల్లో పెరుగుతోందని అన్నారు.
చంద్రయాన్ 3 విజయం.. భారతీయులకు గర్వకారణం అన్న మోదీ.. ఇది మన శాస్త్రవేత్తల సామర్థ్యానికి ప్రతీక అన్నారు. జీ20 సదస్సు విజయం భారత్ ది, ప్రతీ వ్యక్తిదీ అన్న మోదీ.. ఆఫ్రికన్ యూనియన్ ని జీ20లో కలుపుకొని, సదస్సును విజయవంతంగా నిర్వహించామన్నారు. ఇప్పుడు భారత్ విశ్వ మిత్రగా మారిందన్న మోడీ.. ప్రపంచం భారత్ ని మిత్రదేశంలా చూస్తోందని అన్నారు. అందుకు కారణం.. మన సంస్కారం, వేదాల నుంచి వివేకానందుడి వరకూ మనకు ఉన్న చరిత్ర. మన సంప్రదాయాలు అని మోడీ తెలిపారు.