తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర్య రాజన్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకున్నారు. దశ మహా విద్యా గణపతి అవతారంలో ఉన్న స్వామి వారికి గవర్నర్ తొలి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ పట్టు వస్త్రాలు సమర్పించగా.. ఉత్సవ కమిటీ నిర్వహకులుగా దానం నాగేందర్, సీనియర్ నేత, హర్యానా గవర్నర్ దత్తాత్రేయ.. కార్యక్రమాన్ని విజయవంతంగా ప్రారంభించారు.
తెలంగాణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు గవర్నర్ తమిళిసై.. తాను ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని తెలిపారు. ఖైరతాబాద్‌కి వచ్చి స్వామిని దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ నిర్వాహకులు.. ఈసారి బాగా నిర్వహిస్తున్నారని ఆమె అన్నారు. మహా గణేశుడిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులతో ఆ ప్రాంతమంతా కిటకిటలాడుతోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.