తెలంగాణ పోలీసులపై బీజేపీ ఎమ్మెల్యే రఘనందనరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు టీఆర్ఎస్ కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని.. ఎమ్మెల్యే హోదాలో పర్యటిస్తే.. టీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటే పోలీసులు చోద్యం చూశారని చెప్పారు. క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్న వారు నాపై భౌతిక దాడులు చేసేందుకు యత్నించారని.. అదనపు బందోబస్తు ఇవ్వమని అధికారులను కోరినా పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు.
టీఆర్ఎస్ కార్యకర్తలకు మేమున్నాం.. మీకేం కాదు అని ఏసీపీ చెబుతున్నారని.. మా పేర్లు శిలా ఫలకాలపై అవసరం లేదన్నారు. ప్రజలమనుసుల్లో ఉన్నామని.. ఎమ్మెల్యే ప్రాణం కాపాడేందుకు రాలేదు కానీ శిలా ఫలకం కట్టించేందుకు యాభై మంది పోలీసులు అవసరమా అని నిలదీశారు. ఒక్కరిని అరెస్టు చేసేందుకు పదుల సంఖ్యలో పోలీసులు ఎందుకు అని ప్రశ్నించారు.
భౌతికంగా నన్ను ఎలిమినేట్ చేయాలనుకుంటే నేను స్వాగతిస్తున్నానని..రఘనందనరావు భయపడడని స్పష్టం చేశారు. మా మాటలు వినపడకూడదు అని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారని. ఒక్క కేసు ఉన్న బీజేపీ కార్యకర్తలపై పోలీసులు వేదింపులకు పాల్పడుతున్నారన్నారు. నాపై దాడికి యత్నించిన.. శిలాఫలకం కూల్చివేసిన వారిపై కేసు పెట్టరు… నాపైనే కేసు పెట్టారని మండిపడ్డారు.