కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో తెలంగాణలో భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే చేనేత వస్త్రాలపై జీఎస్టీ ఎత్తివేస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. జోడో యాత్రలో ఉన్న రాహుల్‌ను చేనేత రంగం ప్రతినిధులు, పోడు రైతు ప్రతినిధుల బృందం కలిసింది. మధ్యాహ్న భోజన సమయంలో ఆయనకు తమ సమస్యలు విన్నవించారు. ఇందిరమ్మ హయాంలో తమకు ఇచ్చిన భూములను గుంజుకుంటున్నారని గిరిజన సంఘాల ప్రతినిధులు రాహుల్‌కు ఫిర్యాదు చేశారు.
అటవీ ప్రాంతాల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న పోడు భూముల సమస్యలు పరిష్కరించడంతో పాటు భూమి పట్టాలు అందజేసి శాశ్వతంగా హక్కులు కల్పించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. భారతదేశంలో కీలక వ్యవసాయ రంగం.. తర్వాత అతి పెద్ద చేనేత రంగంపై ప్రజలు ఆధారపడి జీవిస్తున్న దృష్ట్యా వస్తువులపై జీఎస్టీ ఎత్తివేసేలా చూడాలని నేతన్నలు రాహుల్‌ను కోరారు.