రాష్ట్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం మునుగోడు ప్రజలకు వచ్చింది – రాజగోపాల్ రెడ్డి

-

నల్గొండ జిల్లా గట్టుపల్ లో బిజెపి బహిరంగ సభకు హాజరయ్యారు మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదన్నారు. అభివృద్ధి కెసిఆర్ కుటుంబ సభ్యులకు మాత్రమే పరిమితమైందని విమర్శించారు రాజగోపాల్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎన్నోసార్లు ప్రయత్నించానని.. అసెంబ్లీ వేదికగా మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రశ్నించానన్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేను కాబట్టి నిధులు మంజూరు చేయలేదన్నారు.

12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ కు అమ్ముడుపోయారని అన్నారు. తాను స్వార్థం కోసం, పదవుల కోసం, డబ్బు కోసం, పార్టీ మారలేదని స్పష్టం చేశారు. నేను రాజీనామా చేశాను కాబట్టే రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్లు మంజూరయ్యాయన్నారు. తాను రాజీనామా చేసిన తర్వాతే నియోజకవర్గంలో రోడ్లు, గట్టుపల్ మండలం గా ఏర్పడిందన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజీనామా చేశానని మరోసారి స్పష్టం చేశారు రాజగోపాల్ రెడ్డి.

నిజంగా అమ్ముడుపోయి ఉంటే మీ ముందు వచ్చి నిలబడే వాడ్ని కాదన్నారు. ధర్మ పోరాటంలో మునుగోడు ప్రజలు అండగా నిలబడతారని ఆశిస్తున్నాను అన్నారు. రాష్ట్ర భవిష్యత్తును తిరగరాసే అవకాశం మునుగోడు నియోజకవర్గం ప్రజలకు వచ్చిందన్నారు. ఇంటింటికి వస్తా, మీ అందరినీ కలుస్తా, మీ ఆశీర్వాదం నాకు కావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news