రాజ్యసభ సభ్యులు డా కె లక్ష్మణ్‌కు కేంద్ర మంత్రి పదవి…!

-

పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల అనంతరం కేంద్ర కేబినెట్‌ను విస్తరించాలని కేంద్రంలోని బీజేపీ నిర్ణయించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తన మిత్రపక్షాల్లోని కొంతమందికి కేబినెట్‌లో చోటు కల్పించనుంది. వాస్తవానికి వర్షాకాల సమావేశాలకు ముందే కేబినెట్‌ విస్తరణ చేయాలని అనుకున్నప్పటికీ….కొత్తగా మంత్రివర్గంలోకి చేరే నేతలు వారికి సంబంధించిన శాఖలపై పార్లమెంట్‌లో లేవనెత్తే ప్రశ్నలకు సరిగా సమాధానాలు ఇవ్వలేరేమోనని ఊహించిన బీజేపీ మంత్రివర్గ విస్తరణ అంశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. ప్రస్తుతం జరుగుతున్న సమావేశాలు ముగిసిన వెంటనే కొత్త మంత్రుల జాబితాను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది.

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో మరోసారి గెలిచి మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటోంది బీజేపీ. త్వరలో జరుగనున్న 5 రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.ఈ క్రమంలో ఓటర్లను ప్రభావితం చేయగల సమర్ధులైన వ్యక్తులనే కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకుంటోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ర్టం నుంచి ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనే అంశం చర్చనీయాంశంగా మారింది.

రాష్ర్ట అధ్యక్ష పదవి నుంచి తొలగించిన బండి సంజయ్‌కి కేంద్రమంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఊహాగానాలు కూడా భారీగా నడిచాయి.అయితే ఎవరూ ఊహించనివిధంగా రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్‌కు కేంద్రమంత్రిగా అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.బండి సంజయ్‌కు ఇప్పటికే జాతీయ కార్యవర్గంలో చోటు కల్పించింది బీజేపీ. ఉత్తరప్రదేశ్‌ రాష్ర్టం నుంచి కె లక్ష్మణ్‌ ఇటీవల రాజ్యసభకు ఎన్నికయ్యారు. అన్నిటికీ అర్హత కలిగిన వ్యక్తిగా విద్యావంతుడిగా ఉన్న లక్ష్మణ్‌కి మంత్రిగా అదృష్టం దక్కే అవకాశం ఉందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

నీతి,నిజాయితీ,నిబద్ధత కలిగిన వ్యక్తిగా డా కె లక్ష్మణ్‌కు తెలంగాణలో పేరుంది. ప్రతి అంశానికి పారదర్శకత జోడించడంతో పాటు ఎక్కడా నోరుజారని నైజం ఇతనిది. అన్ని రాజకీయ పార్టీల నేతలను గౌరవిస్తారు లక్ష్మణ్‌.ఆర్‌ఎస్‌ఎస్‌,బీజేపీ అని కాకుండా ఎవరు వచ్చి అడిగినా కాదనకుండా సాయం చేసే మనస్తత్వం కావడంతో ప్రధానమంత్రి నరేంద్రమోడీ,హోమ్‌ మంత్రి అమిత్‌షా, జాతీయ అధ్యక్షులు జెపి నడ్డా….ఈ ముగ్గురూ లక్ష్మణ్‌ వైపు మొగ్గారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా తెలంగాణ బీజెపీ రాష్ర్ట అధ్యక్షుడిగా ఆయన సేవలు అందించారు.

మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన డా కె లక్ష్మణ్‌ ఓబీసీ జాతీయ అధ్యక్షుడిగా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.అంతేకాదు ప్రతిష్టాత్మకమైన భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ బోర్డ్‌ సభ్యుడిగా ఉన్నారు. ఇందులో ప్రధాని మోడీ సహా అమిత్‌షా వంటి 11 మంది ప్రముఖులు ఉన్న కమిటీలో ఆయన కూడా ఓ సభ్యుడు.బీజెపీ కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిటీలో కూడా లక్ష్మణ్‌ ఓ సభ్యుడిగా కొనసాగుతున్నారు.రాజ్యసభ సహా ఇప్పటికే నాలుగు పదవుల్లో కొనసాగుతున్న లక్ష్మణ్‌కి త్వరలో కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పిస్తారని బీజేపీలోని నేతలు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ర్టం నుంచి కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్లగల అర్హుల్లో కె లక్ష్మణ్‌ మినహా అంతటి వ్యక్తులు లేరని అటు రాజకీయ విశ్లేషకులు కూడా చర్చించుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news