తెలుగు పత్రికా రంగం, ప్రసార మాధ్యమాల్లో విప్లవాత్మక మార్పులకు బీజం వేసిన మహనీయుడు షామోజీరావు అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. ఫిల్మ్ సిటీలో రామోజీరావు పార్థివదేహానికి ఆయన నివాళులర్పించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ ఈ నష్టం సామాన్యమైనది కాదన్నారు. రామోజీరావు మృతి తెలుగు పత్రికా రంగంతో పాటు ప్రపంచంలోని తెలుగువారందరికీ తీరని లోటు అని అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
“విలువలతో కూడిన జర్నలిజానికి రామోజీరావు గుర్తుగా నిలిచిపోతారు. ఈనాడు, ఈటీవీతో తనదైన ముద్ర వేశారు. ఎల్లవేళలా తెలుగు రాష్ట్రాలు, దేశం బాగుండాలని తపించేవారు. తెలుగు భాషను అభిమానించిన విధానం, తపన అందరికీ ఆదర్శం. ఎన్నో సందర్భాల్లో ఆయన్ను కలిసే అవకాశం దక్కింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తెలుగు వారి గురించి చెప్పేవారు. గతం గురించి చెప్పడంతో పాటు భవిష్యత్తు ఎలా ఉండాలనేదానిపై పలు సూచనలు చేసేవారు. యూనివర్సల్ స్టూడియో స్థాయిలో ఫిల్మ్ సిటీని నిర్మించాలనే సంకల్పం.. ఓ విజనరీకి మాత్రమే సాధ్యం. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా రామోజీరావు జ్ఞాపకాలు, ఆశయాలు, ఆలోచనలు తప్పకుండా భవిష్యత్తులో స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయి. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆయన గుర్తుంటారు” అని కేటీఆర్ అన్నారు.