ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం మరోసారి బట్టబయలైందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వారి బంధానికి నిదర్శనమే రైతు బంధు నిధుల విడుదలకు ఈసీ ఆదేశమివ్వడం అని పేర్కొన్నారు. అంతే కాకుండా వివేక్, పొంగులేటి ఇళ్లలో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో రూ.300 కోట్లు సీజ్ చేయకపోవడం.. కాంగ్రెస్ నేతలపై లాఠీఛార్జ్ చేయడమని తెలిపారు. 2018లో జూన్‌లో రైతు బంధు పథకం ప్రారంభించిన కేసీఆర్ సర్కార్.. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారని వెల్లడించారు.
ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు చెప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామని.. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరామని తెలిపారు. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చి… కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆర్ఎస్కు సహకరించిందని వ్యాఖ్యానించారు. దీంతో బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడిందని పేర్కొన్నారు.