కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికే.. తెలంగాణలో తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత… సంక్షేమ పథకాలు, ఉద్యోగాలు ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ సభ్యత్వంలో పని తీరే బట్టే.. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో పదవులు ఇస్తామని… ఆ బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇవాళ మీడియాతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని.. సోనియమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు మీ ఇంటికే వస్తాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ లో సభ్యత్వం తీసుకున్న వారికే సంక్షేమ పథకాలు అమలు చేస్తామని.. పార్టీ లో చేరిన వారికే మొదటి బంతి భోజనం పెడతామని ప్రకటన చేశారు రేవంత్ రెడ్డి. ఇప్పటి వాకు 38 లక్షల 40 వేల సభ్యత్వాలు నమోదు అయ్యాయని.. ప్రతి బూతులో 100 సభ్యత్వం చేయని నాయకుల పదవులు రద్దు చేయిస్తామని హెచ్చరించారు.
సికింద్రాబాద్ పార్లమెంట్ లో దీన్ని మార్చి 25 తర్వాత అమలు చేస్తామనీ ప్రకటన చేశారు. పని చేయని వారి పదవులు తీసేయండని.. పని చేసిన వాళ్లకు గుర్తింపు ఉండాలి కాబట్టి పని చేయని వారికి పదవులు రద్దు చేస్తామని పేర్కొన్నారు. గ్రామాల్లో కష్టపడ్డ వాళ్లకు..మండల స్థాయిలో.. మండల స్థాయి వారికి జిల్లా స్థాయి పదవులకు ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.