ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మల గద్దల వద్ద భక్తజనం పోటెత్తింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం రోజున భక్తులంతా వేడుకను ముగించుకొని పిల్లాపాపలతో రాష్ట్ర నలుమూలు ఉండే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన భక్తజనం అమ్మవార్లను దర్శించుకున్నారు. తమ తమ సొంత వాహనాలలో వచ్చిన భక్తులు జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకొని మొక్కిన మొక్కును తీర్చిన ఆ వనదేవతలకు వడి బియ్యం పసుపు కుంకుమ కొబ్బరికాయ పువ్వులు పండ్లు నూతన వస్త్రాలతో ఆ తల్లుల సన్నిధికి చేరుకొని సమర్పించుకుంటున్నారు.
కోరిన కోరికలు తీర్చిన తల్లికి నిలువెత్తు బంగారం (బెల్లం) సమర్పించుకొని మేకలు కోళ్లు కోసుకొని తిరుగు ప్రయాణంలో మేడారం చుట్టుప్రక్కలలో ఊరటం, కొత్తూరు, నార్లాపూర్, వెంగలాపూర్, ప్రాజెక్టు నగర్ గ్రామాల్లోని అటవీ ప్రాంతంలో చెట్ల క్రింద విడిది చేస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు లక్షకు పైనే దాటి ఉంటారని అధికారులు అంటున్నారు.