ఓ వైపు TSPSC క్వశ్చన్ పేపర్ లీకేజీ మరోవైపు పదో తరగతి ప్రశ్నా పత్రాల లీకులు రాష్ట్రంలోని ఉద్యోగార్థులు విద్యార్థుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టేస్తున్నాయి. తాజాగా పదో తరగతి పరీక్షలకు సంబంధించి హిందీ క్వశ్చన్ పేపర్ లీక్ అవ్వడం పట్ల విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్రంగా స్పందించారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడే ఉద్యోగులను ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పదో తరగతి ప్రశ్నపత్రాలు లీక్ కాలేదన్న మంత్రి.. ఈ విషయంలో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు.
పదో తరగతి పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో బీఆర్కే భవన్ నుంచి మంత్రి సబితా దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పరీక్షల విషయంలో స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తో ఆడుకోవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇంకా మిగిలిన నాలుగు పరీక్షల నిర్వహణ విషయంలో మరింత కఠిన చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు. . ఎట్టిపరిస్థితుల్లోనూ సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించవద్దని ఆదేశించారు.