ఎస్సీ వర్గీకరణ పై ఏర్పాటైన క్యాబినెట్ సబ్ కమిటీ ఈరోజు మొదటిసారి సమావేశం అయింది. అయితే ఈ సమావేశం పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం ఈ నెల 13న సుప్రీంకోర్టు తీర్పు పై పరిశీలన చేసి విధి విధానాలు రూపొందించాలని కమిటీ ఏర్పాటు చేశారు. మొదటి మీటింగ్ లో ఈ రోజు ఎస్సీ లలో ఉన్న జనాభా, కులాలు పూర్వాపరాలు గతంలో ఎస్సీలకు ఉన్న ప్రాధాన్యతలు పై సమగ్ర వివరాలపై చర్చించాం. పంజాబ్, హర్యానా, తమిళ్నాడు లలో ఎస్సీ రిజర్వేషన్ అమలు అవుతున్న తీరు పై అధ్యయనం చేస్తాం.
తొందర్లో నిపుణులతో ఆయా రాష్ట్రాల్లో పర్యటన ఉంటుంది. మూడు నాలుగు రోజుల్లో కమిటీ పూర్తిస్థాయి కార్యాచరణ సిద్ధమవుతుంది.ఎస్సీ వర్గీకరణ పై ఎవరైనా వారి అభిప్రాయాలు కమిటీ కి ఇవచ్చు. అందరికీ న్యాయం జరిగే విధంగా కమిటీ విధివిధానాలను రూపొందిస్తుంది. భవిష్యత్తులో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండాలంటే సమగ్ర అధ్యయనం అవసరం అని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు.