తెలంగాణ పీజీటీ గురుకుల ఆన్‌లైన్ పరీక్ష నిర్వహణలో సాంకేతిక సమస్య తలెత్తింది. సర్వర్‌లో సమస్య తలెత్తడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ్టి ఇంగ్లీష్ పరీక్ష ఇంకా ప్రారంభం కాలేదు. ఉదయం 8:30 గంటలకే పరీక్ష ప్రారంభం కావాల్సింది. కానీ సర్వర్ సమస్య కారణంగా పరీక్షా కేంద్రాల్లోకి ఇంకా అభ్యర్థులను అనుమతించడం లేదు. సర్వర్‌లో సాంకేతిక సమస్య కారణంగా పరీక్ష ఆలస్యమైనట్లు పరీక్షా కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. కాగా, పీజీటీ ఇంగ్లీష్ పరీక్ష కోసం కేంద్రాలకు అభ్యర్థులు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే గంట దాటినా.. లోపలికి అనుమతించకపోవడంపై అభ్యర్థులు మండిపడుతున్నారు.
“నేను ఇవాళ గురుకుల పీజీటీ పరీక్ష రాయడానికి వచ్చాను. ఆన్లైన్లో పరీక్ష కాబట్టి గంట ముందే కేంద్రం వద్దకు చేరుకున్నాను. గంట ముందే మమ్మల్ని లోపలికి పంపించాలి. కానీ పరీక్ష సమయం దాటిపోయినా ఇప్పటికీ లోపలికి అనుమతించడం లేదు. అడిగితే ఏదో టెక్నికల్ సమస్య అంటున్నారు. ఇలాగైతే మేం నష్టపోవాల్సి వస్తుంది. అదే మేం ఒక నిమిషం ఆలస్యం అయితే మమ్మల్ని లోపలికి అనుమతిస్తారా..? ” అంటూ పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.