హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్ వద్ద ఈ నెల 23న ఓ కారు హల్చల్ సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ తనయుడు సాహిల్‌ను తప్పించి మరొకరిని నిందితుడిగా చేర్చారని ఇటీవల డీసీపీ తెలిపిన విషయం తెలిసిందే. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సాహిల్ను ఎలా తప్పించారో అధికారులు తెలుసుకున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ప్రమాదం జరిగిన రోజున రాత్రి విధుల్లో ఉన్న ఇన్‌స్పెక్టర్ దుర్గారావు ఘటనాస్థలం నుంచి సాహిల్‌ను కారులో పంజాగుట్ట ఠాణాకు తీసుకొచ్చి కానిస్టేబుల్‌కు అప్పగించి, పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు బ్రీత్‌ఎనలైజర్ పరీక్ష కోసం పంపారు. ఈక్రమంలో నిందితుడు తప్పించుకొని, అప్పటికే బయటున్న కారులో ఇంటికి వెళ్లి తన డ్రైవర్‌ను తన స్థానంలో పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపాడు. ప్రమాద సమయంలో తానే కారు నడిపినట్టు వాంగ్మూలం ఇప్పించేలా పురిగొల్పాడు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఇన్స్పెక్టర్ దుర్గారావు ఉన్నతాధికారులకు అసలు విషయం చెప్పకుండా ప్రయత్నించినట్లు తేలింది. అంతే కాకుండా సాహిల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించినట్లు అధికారులు భావిస్తున్నారు. పంజాగుట్ట ఠాణా సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారాల ద్వారా దర్యాప్తును పక్కదారి పట్టించడంలో ఇన్‌స్పెక్టర్ కీలకంగా వ్యవహరించినట్టు గుర్తించిన తర్వాత ఇన్‌స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేసినట్టు సమాచారం.