తెలంగాణలో సర్పంచుల పాలన ముగిసింది. ఇవాళ్టి నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన మొదలుకానుంది. ఇందుకు సంబంధించి పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా జీవో జారీ చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 12,769 పంచాయతీలకు కలెక్టర్లు ప్రత్యేక అధికారులను నియమించారు. తహసీల్దార్, ఎంపీడీవో, వ్యవసాయాధికారి, ఎంఈవో, మండల పంచాయతీ అధికారి స్థాయి సిబ్బందిని ప్రత్యేక అధికారులుగా నియమించారు.
సర్పంచ్ ఎన్నికలు పూర్తయ్యే వరకు ప్రత్యేక అధికారులు బాధ్యతలు నిర్వహించాలని పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం డిజిటల్ సంతకాల కీలు, పెన్‌డ్రైవ్‌ల రూపంలో సర్పంచులు, ఉప సర్పంచుల వద్ద ఉన్నాయి. వాటిని పంచాయతీ కార్యదర్శులు స్వాధీనం చేసుకోనున్నారు. ఇవాళ విధుల్లో చేరనున్న ప్రత్యేక అధికారులకు ప్రభుత్వం డిజిటల్ సంతకాల కీలను ఇచ్చింది. ఇప్పటి వరకు సర్పంచులు, ఉప సర్పంచులకు జాయింట్ చెక్‌పవర్ కొనసాగగా, ఈరోజు నుంచి ప్రత్యేకాధికారి, పంచాయతీ కార్యదర్శికి జాయింట్ చెక్‌పవర్ ఇవ్వాలని నిర్ణయించింది.