ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై శ్రీధర్ బాబు సంచలన నిర్ణయం తీసుకున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురైనా అధికారులు స్పందించక పోవడం పట్ల ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు, చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కోట్ల విలువైన భూములను కబ్జాదారులు చెరబట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నతాధికారులకు ఆయన ఒక లేఖ రాశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యే డా. మట్టా రాగమయి ఫిర్యాదుతో మంత్రి అధికారులను అప్రమత్తం చేసారు.
ఆమె ఫిర్యాదును ప్రస్తావిస్తూ ప్రభుత్వ భూముల పరిరక్షణలో ఉదాసీనత ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇండస్ట్రీస్, కామర్స్ డిపార్ట్ మెంటు స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి ముఖ్య కార్యదర్శి, తెలంగాణా పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ఎండీ, హెచ్ ఎండీఏ కమిషనర్లకు శ్రీధర్ బాబు ఈ లేఖను రాశారు. ఖానామెట్ రెవిన్యూ గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 41/14 లోని 252.24 ఎకరాల భూమి ఉండగా 2008లో అప్పటి ప్రభుత్వం 180.13 ఎకరాలను హుడా (ప్రస్తుత హెచ్ ఎండీఏ) కు కేటాయించింది.
అందులో నుంచి 75 ఎకరాలను పారిశ్రామిక మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ ( ప్రస్తుత టిజిఐఐసి) కు హుడా బదిలీ చేసింది. హుడా ఆధీనంలోని 105.13 ఎకరాలు, టిజిఐఐసి యాజమాన్యంలోని 75 ఎకరాల్లో అత్యధిక భాగం కబ్జాదారుల ఆధీనంలోకి వెళ్లిందని శ్రీధర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామంలోని 100, 101 సర్వే నంబర్లలోని 100 ఎకరాల భూమిపై కబ్జా యత్నాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజావసరాలకు ఉపయోగపడాల్సిన విలువైన ప్రభుత్వ భూములను కాపాడేందుకు ఉన్నతాధికారులు ప్రణాళిక రూపొందించి తక్షణం కార్యరంగంలోకి దిగాలని సూచించారు. నిర్దిష్ట కాలవ్యవధిలో సమీక్షలు నిర్వహించి క్షేత్ర స్థాయి సిబ్బందికి బాధ్యతను నిర్దేశించాలని శ్రీధర్ బాబు చెప్పారు. ఆక్రమణల సమాచారం ఉన్నా నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.