శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

-

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఏకధాటి వర్షాలు కురుస్తున్నాయి. గత వారం రోజులుగా కురుస్తున్న వానలతో జిల్లా అస్తవ్యస్తమవుతోంది. భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో వాగులు ఉప్పొంగి రహదారులపైకి వరద నీరు చేరుతోంది. దీనివల్ల వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు భారీ వర్షాలతో శ్రీరాం సాగర్ ప్రాజెెక్టుకు వరద పోటెత్తుతోంది.

భారీ వరద పోటెత్తడంతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేట్లను అధికారులు తెరిచారు. ప్రాజెక్టులోని 8 గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. అయితే ప్రాజెక్టులో 1091 పూర్తీ స్థాయి నీటిమట్టానికి గాను.. ప్రస్తుతం 1087 అడుగుల నీరు ఉంది. 88,827 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 73.547 టీఎంసీల నీరు నిలువ ఉంది.

ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలో వాగులు, వంకలు, ఒర్రెలు ఉప్పొంగుతున్నాయి. చెరువులు,కుంటలు  నిండు కుండల తలపిస్తు  అలుగు పోస్తున్నాయి. రోడ్లపై నుంచి వెళ్తున్న వరదతో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ధర్పల్లి మండలంలోని  చిన్న మధ్య తరహా ప్రాజెక్ట్ అయిన రామడుగు ప్రాజెక్ట్ నిండి 15 వందల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండటంతో మండలంలోని సీతాయిపేట్‌, మైలవరం, వాడి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. లింగాపూర్ వాగుకు వరద పోటెత్తుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news