జూన్ 15న కల్నల్ సంతోష్ బాబు విగ్రహావిష్కరణ

చైనా సైనికుల దాడిలో వీరమరణం పొందిన కల్నల్‌ సంతోష్‌బాబు విగ్రహం ఏర్పాటుకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. సంతోష్‌ బాబు స్వస్థలమైన సూర్యాపేట పట్టణంలో ఈ నెల 15న ఆయన విగ్రహాన్నిఆవిష్కరించనున్నట్లు మంత్రి మంత్రి జగదీశ్‌ రెడ్డి తెలిపారు.

ఈ మేరకు సూర్యాపేటలోని కోర్టు చౌరస్తాలో విగ్రహావిష్కరణ ఏర్పాట్లను మంత్రి జగదీశ్‌ రెడ్డి పరిశీలించారు. సంతోష్ బాబు సూర్యాపేట పేరును జాతీయ స్థాయికి తీసుకుపోయారని, దేశానికి ఆయన చేసిన సేవలను గుర్తిస్తూ..వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారంగా జిల్లా కేంద్రంలోని ప్రముఖ కోర్ట్ చౌరస్తాలో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

గతేడాది జూన్ లో లడాఖ్‌ సరిహద్దులోని గల్వాన్‌ లోయలో చైనా దురాక్రమణను తిప్పికొట్టే క్రమంలో కల్నల్‌ సంతోష్‌బాబు వీరమరణం పొందిన విషయం తెల్సిందే. కాగా కల్నల్‌ సంతోష్‌బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం అండగా నిలిచింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సంతోష్‌బాబు సతీమణీని డిప్యూటీ కలెక్టర్‌గా నియమించింది.