రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల వర్షాలు లేకపోవడం వల్ల రైతులు చాలా వరకు ఆలస్యంగా వరినాట్లు వేశారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో చాలా వరకు పంటలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో వివిధ పంటల సాగుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తెగుళ్లు, నివారణ చర్యలు.. తదితర అంశాలపై తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం కీలక సూచనలు చేసింది.
వరి సాగుచేసే రైతులు నార్ల కంటే నేరుగా విత్తనాలు చల్లడానికే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సూచించింది. వరి పంటకు సంబంధించి ముదురునారు వేయొద్దని.. అదును దాటిపోయినందున పత్తి, వేరుశనగ ఇప్పుడు విత్తవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్పారు. వరి రైతులు స్వల్పకాలిక రకాలను ఎంచుకొని నేరుగా విత్తనాలు చల్లాలని సూచించారు.
తప్పనిసరి పరిస్థితుల్లో ముదురు నారు వేయాల్సి వస్తే జేజీఎల్ 24423, కేఎన్‌ఎం 118, జేజీఎల్ 18047, ఎంటీయూ 1010 దొడ్డు రకాలు.. ఆర్‌ఎన్‌ఆర్ 15048, కేఎన్‌ఎం 1638, వరంగల్ 362 సన్నరకాలను ఎంపిక చేసుకొని ప్రత్యేక యాజమాన్య పద్ధతులను పాటించాలని.. కుదురుకు 6-8 మొక్కలతో నాట్లు వేయాలని తెలిపారు. కుదురుకు 6-8 మొక్కలతో నాట్లు వేయాలని.. నత్రజని ఎరువును రెండు దఫాల్లో.. తొలుత 70% వాడాలని.. మిగిలిన 30 శాతం అంకుర దశలో వాడాలని సూచించారు.